Saturday, February 25, 2012

ఇష్టం, నాకు ఇష్టం
తొలిసంధ్య పొద్దంటె ఇష్టం
తొలిసారి ముద్దంటె ఇష్టం

ఇష్టం, నాకు ఇష్టం
సెలయేటి పరుగంటె ఇష్టం
ఎలమావి చిగురంటె ఇష్టం

ఇష్టం, నాకు ఇష్టం
గగనాన హరివిల్లు ఇష్టం
భువనాన నీ నవ్వు ఇష్టం
ఇష్టం, నాకు ఇష్టం

Saturday, April 7, 2007

తెలుగు గజల్

నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది
నీ మాటే మధురమైన వాద్యంలా ఉంది

తొలకరి జల్లులాగ ఒక్కసారి తొంగి చూడరాదా
నీవు లేని బ్రతుకు ఎడారిలో సేద్యంలా ఉంది
||నీ చూపే||

ప్రణయమూర్తివనుకున్నా పాషాణమైపోతివే
నా మది నువు తాకని నైవేద్యంలా ఉంది
||నీ చూపే||

నీ పేరు తలవగానే మాట తడబడుతుంది
నీ తలపే యుగయుగాల మద్యంలా ఉంది
||నీ చూపే||

ఎపుడు నీ తోడుగ నాకుండాలని ఉంటుంది
నీడ లాగ మారితేనే సాధ్యం లా ఉంది
||నీ చూపే||

Wednesday, March 21, 2007

సినారె (CiNaRe)

ఆశల దీప స్తంభాలకు నిరాశలు క్రీనీడలు

సత్యాల జీవ వాహినులకు స్వప్నాలు రంగుల బుడగలు

ఆ నీడలకు జడుసుకోక
ఆ బుడగలకు భ్రమసి పోక

సాగిపోతాడు కాంతి లహరిలా

చైతన్యకేతనుడు మానవుడు


నేలను సాగుచేసే వాడికి ధూళి అంటక తప్పుతుందా?
శ్రమనే పణంగా ఒడ్డిన వాడికిచెమట పట్టక తప్పుతుందా?

ఏ రంపపు కోత లేకుంటే ఎలా పుడుతుంది వేణువు?
ఏ ఉలి దెబ్బ పడకుంటే ఎలా పలుకుతుంది స్థాణువు?
తమస్సు వల పన్నినప్పుడు
మనస్సు పట్టు తప్పినప్పుడు
ఆలోచన ఆయుధంగా
అంతశ్చేతన ఆలంబనగా

పురోగమిస్తాడు మనిషి
పరిసరాల పైకెగసి
వెదురెందుకు ఏడవాలి విరిచేస్తుంటే
విరవందే వేణువు అవుతుందా అది?
గంధపు చెట్టెందుకు ఏడవాలి నరికేస్తుంటే
నరకందే పరిమళమౌతుందా అది?
(సమస్య)
మెత్తగా ఉంటే నెత్తిపై కాళ్ళు పెడుతుంది
కత్తిలా ఉంటే గులామై కాళ్ళు పడుతుంది

కామన (kaamana)

వలపునై నీ హృదయ సీమల నిలువ వలెనని యున్నది
పిలుపునై నీ అధర వీధుల పలుక వలెనని యున్నది


చైత్ర మాస నవోదయమ్మున చల్ల గాలికి ఆడుతూ
పట్టుకుచ్చుల నీడ గొడుగులు పట్టవలెనని యున్నది

నీవు నడిచే దారి పక్కన నింబ భూరుహ శాఖనై
పట్టుకుచ్చుల నీడ గొడుగులు పట్టవలెనని యున్నది

అంతుచిక్కని అందమంతా గంతులేసే రీతిగా
చక్కనౌ నీ బొమ్మ యొక్కటి చెక్కవలెనని యున్నది

నన్ను చూచీ కోపగించే కన్నులందలి కెంపునే
తార హారముగా గళమ్మున దాల్చవలెనని యున్నది

స్నేహసూత్రము పడుగు పేకల జేరి రెపరెపలాడగా
పైటనై నీ ఎడద పైనే వ్రాలవలెనని యున్నది

కాలి కూలిన మదనునికి ప్రాణాలు పోసే కోమలీ
శివుని గుండెను నీదు చూపుల చీల్చవలెనని యున్నది

బుగ్గపైగల లేగులాబీ మొగ్గలోపలి నిగ్గుతో
కోటి శిశిర పిశాచ గణముల కూల్చవలెనని యున్నది

ముదిసి పోయిన కాలమునకే పదును కలిగే రీతిగా
నేను నీవై నిఖిల జగముల నిండవలెనని యున్నది

---దాశరథి




Tuesday, March 20, 2007

హృదయ సౌరభం (hRdaya saurabhaM)

ముసిరినవి నా మదిని మధుర భావాలెన్నో
మధువుకై నెరయాడు మధుపాల వోలె

విరిసినవి నాలోన వేయితలపులు చాల
వ్యోమ వారాశిలో తారకల వోలె

చివురించె నాలోన చిరునగవులు వేయి
యవ్వనపు గాలిలో మల్లియల వోలె

స్పందించె నాలోన మధురంపు తలపొకటి
నీల మేఘుని ఇంటి జవరాలి వోలె

మోకరించెను నాదు ఎదలోని బరువెల్ల
ఆదిదేవుని చెంత ఆరాధికల వోలె

స్వీకరింపుము నాదు హృదయసౌరభ మిదిగో
దాచియుంచితి నీకై వేయితనువుల నుండి

పాలపుంత (paalapunta)

కుటిల చూర్ణ కుంతలా
కోపమెందుకంతలా
కులుకుల శాకుంతలా
నవ్వు పాలపుంతలా

నీవుంటే నా ముందు
నాకెంతో కనువిందు
నీ మోమే అరవిందం
నీ మేనే హిమగంధం

చెలిమి లోన కలిమి చేరి యుండు ! (chelimi lOna kalimi chEri yunDu)

ఆ.వె.
మిత్ర శబ్దమునకు మించిన శబ్దమ్ము
లేదు జగతిలోన లేనె లేదు|
మిత్రమందు సుధలు మిళితమై యున్నవి
చెలిమి లోన కలిమి చేరి యుండు||

ఆ.వె.
పనస తొనల కన్న పంచదారల కన్న
జుంటితేనె కన్న జున్ను కన్న |
చెఱకు రసము కన్న చెలిమియే తీపిరా
చెలిమి లోన కలిమి చేరి యుండు||

ఆట వెలదులు (aaTa veladulu)



ఆ.వె.
నిన్నె వలచినాను నీరేజ నేత్రికా
మనసు దోచినట్టి మగువ నీవె|
కనులు మూసినంత కలలోకి వచ్చేవు
నిన్ను మరువ లేను నిజము సుమ్మి||

ఆ.వె.
మధురమైన పాట మదిలోన చెలరేగె
పెదవి దాటిరాదు ఎదను వీడి|
కనుల ముందు నీవు కనిపించినంతనే
కదలి వచ్చెనదియు కావ్యమల్లె||

తెలుగు భక్తి (telugu bhakti)


ఆ.వె.

ఆట పాట లందు ఆచారములలోన
మాట లందు మాయ మర్మమందు
పేట లోన జనపు మాటల లోనను
తేట తెల్లమాయె తెలుగు భక్తి

నియంత...! (niyaMta...!)



నిశికే కాంతులు తెచ్చే ఇన కిరణం నీ వదనం
శశికే భ్రాంతులు గొల్పే నవ కమలం నీ నయనం

నాసికలో పూసిన సంపెంగలు ఎన్నెన్నో
చెక్కిలిపై చేరిన చేమంతులు ఎన్నెన్నో

మనసులోని భావాలకు మౌనాన్నే నేర్పిస్తాయ్
కనులలోని కావ్యాలకు బాణాల్నే గురి చూస్తాయ్
తనువు లోని అణువణువును అనుక్షణం శాసిస్తాయ్

నియంతలా.............
నీ కళ్ళు?